కదిరి వైసీపీలో అసమ్మతి పోరు- ఇంఛార్జిల మార్పు వద్దంటూ భారీ ర్యాలీ - Siddareddy Rally Kadiri
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 1, 2024, 10:58 PM IST
YCP MLA Siddareddy Rally in Kadiri Constituency:శ్రీసత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో వైసీపీ నిరసనలు మరింత తీవ్రమయ్యాయి. ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జిగా బాధ్యతల నుంచి తప్పించడాన్ని నిరసిస్తూ కదిరిలో ఆయన వర్గీయులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్ అండ్ బీ బంగ్లా నుంచి కాలేజీ రోడ్డు మీదగా ప్రదర్శన కొనసాగింది. టవర్ క్లాక్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకూ ర్యాలీ చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా తన బలాన్ని నిరూపించుకోవడానికే ఎమ్మెల్యే ర్యాలీ నిర్వహించారని పార్టీలో గుసగుసలు వినిపించాయి. సిద్ధారెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలించేందుకు సన్నహలు చేస్తోంది. ఆ ప్రక్రియలో భాగంగానే బలహీన నియోజకవర్గాల్లో ఉన్న ఇంఛార్జిలను మార్చి ఆ స్థానంలో కొత్త వారిని నియమిస్తుంది. టిక్కెట్టు ఎవరెవరికి కేటాయిస్తారో అని వైసీపీ నేతలు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి తరలి వస్తున్నారు.