YCP MLA Rachamallu Daughter Married Mechanic Son: ఎమ్మెల్యే కుమార్తె ప్రేమ వివాహం.. దగ్గరుండి జరిపించిన రాచమల్లు - MLA daughter married a mechanic son Proddutur
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 7, 2023, 5:58 PM IST
YCP MLA Rachamallu Daughter Married Mechanic Son: వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే తన కుమార్తెకు పెళ్లి నిరాడంబరంగా జరిపించి ఆదర్శంగా నిలిచారు. ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తన కుమార్తెకు నచ్చిన వ్యక్తితో వివాహం జరిపించాడు. తన మొదటి కుమార్తె పల్లవి ప్రేమ వివాహాన్ని ఎమ్మెల్యే దగ్గరుండి జరిపించారు. పట్టణానికి చెందిన పవన్ కుమార్ అనే యువకుడితో బొల్లవరంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంప్రదాయబద్దంగా వివాహం చేశారు. అనంతరం ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించారు.
Proddatur MLA Rachamallu Siva Prasad Reddy Daughter Marriage: తన కుమార్తె పల్లవి ఇష్టం ప్రకారమే పవన్ కుమార్‌తో ప్రేమ వివాహం చేసినట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తెలిపారు. కలిసి చదువుకున్న రోజుల్లో ఆ అబ్బాయిని.. తన కుమార్తె ఇష్టపడటంతో డబ్బు, హోదా, కులానికి విలువ ఇవ్వకుండా వారికి పెళ్లి చేసినట్లు చెప్పారు. తన కుమార్తె తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుందని.. ఈ విషయంలో తనకు కులాల పట్టింపులు లేవని తెలిపారు. అబ్బాయి చదువుకున్నాడా లేదా.. తన కూతుర్ని పోషించగలడా లేదా అనేది మాత్రమే చూసినట్లు తెలిపారు. తనకు తన పిల్లల సంతోషమే ముఖ్యమనీ, అందుకోసమే.. అబ్బాయి ఆస్తులు, అంతస్తులను పట్టించుకోలేదని ఎమ్మెల్యే తెలిపారు. అబ్బాయి తండ్రి ఆర్టీసీలో మెకానిక్‌గా ఉద్యోగం చేస్తున్నాడని ఎమ్మెల్యే పేర్కొన్నారు.