భూ వివాదంలో మైనార్టీపై దాడి చేసిన వైసీపీ నాయకులు - చికిత్స పొందుతున్న బాధితుడు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 30, 2023, 3:51 PM IST
YCP Members Attack minority community person :పొలం వివాదంలో మైనార్టీ వర్గానికి చెందిన ఓ వ్యక్తిపై.. వైసీపీ వర్గీయులు దాడి చేశారు. గుంటూరుకు చెందిన బాజీ అనే వ్యక్తి.. ఫిరంగిపురం మండలం అమీనాబాద్‌లో 2019లో రెండు ఎకరాల పొలం కొన్నాడు. ఈ పొలం వివాదంలో ఉండటంతో అధికారులు.. పట్టా పుస్తకం ఇవ్వలేదు. అన్ని రకాల పత్రాలు ఉన్నా.. డీసీసీబీ ఛైర్మన్ లాలుపురం రాము వల్లే తనకు పట్టా పుస్తకం రాలేదని బాజీ ఆరోపించాడు. ఈ విషయంపై బుధవారం (నవంబరు 29న).. ఫిరంగిపురం తహశీల్దారు కార్యాలయానికి కలెెక్టర్ వస్తున్నారనే విషయం తెలిసి ఫిర్యాదు చేయటానికి వెళ్లాడు బాజీ.
కలెక్టర్ రాకపోవడంతో ఇంటికి తిరిగి వెళ్తుండగా.. నగర శివార్లలోని నల్లపాడు ఎకో పార్కు వద్ద ఇద్దరు వ్యక్తులు బాజీపై దాడి చేశారు. దాడిలో గాయపడిన బాజీ ప్రస్తుతం గుంటూరులోని జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. తనపై దాడి జరిగిందని నల్లపాడు పోలీసు స్టేషన్లో బాజీ ఫిర్యాదు చేశారు. డీసీసీబీ ఛైర్మన్ లాలుపురం రాము అనుచరులు దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2020 నుంచి వివాదం జరుగుతోందని.. గతంలో కూడా ఇలానే బెదిరించారని బాజీ ఆరోపించారు. అధికారం ఉందన్న అండతోనే.. మైనార్టీ వర్గానికి చెందిన తనపై దాడి చేశారని ఆవేదన వెలిబుచ్చారు.