పశువైద్యశాల స్థలం కబ్జా, రోజురోజుకు తారస్థాయికి చేరుతున్న వైసీపీ అక్రమాలు - ప్రభుత్వ పశువైద్యశాల
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 20, 2023, 7:31 AM IST
YCP Leaders Veterinary Hospital Site kabza in Ananthapuram District: రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ నేతల అరాచకాలు రోజురోజుకు తారస్థాయికి చేరుకుంటున్నాయి. అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం గోవిందవాడ గ్రామంలో వైసీపీకి చెందిన నాయకులు ప్రభుత్వ పశు వైద్యశాలను అక్రమంగా కూలగొట్టి ఆ స్థలం కబ్జా చేసేందుకు యత్నించారు. జెేసీబీతో పశువైద్యశాల భవనం పాక్షికంగా ధ్వంసం చేశారు. జెేసీబీ మరమ్మతులకు గురి కావడంతో పశువైద్యశాల భవనం కూల్చివేత పనులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు గ్రామ ప్రజలు తెలిపారు. 2001లో గోవిందవాడ గ్రామంలో గ్రామీణ పశువైద్యశాలను టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిర్మించింది. అదే గ్రామానికి చెందిన బళ్లారి నాగమ్మ గతంలో ప్రభుత్వ పశు వైద్యశాల నిర్మాణానికి ఉచితంగా స్థలాన్ని ఇచ్చారు. ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసి గత వారం రోజుల క్రితం అధికార పార్టీకి చెందిన నాయకులు కనేకల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వారి పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిసింది. గ్రామం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ పశువైద్యశాలను కూల్చివేయడాన్ని గ్రామ ప్రజలు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు నాయకులు ప్రభుత్వ స్థలాలతో పాటు.. ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేసి స్థలాలను కబ్జా చేయడానికి ఏమాత్రం ఆలోచించపోవడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అనంతపురం జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాల భూకబ్జాలు ఇటీవల పెచ్చు మీరిపోతుడటంతో ప్రజలు బాహాటంగా విమర్శిస్తున్నారు. వైద్యశాల స్థలాన్ని సంబంధిత అధికారులు కబ్జా చేయనివ్వకుండా గ్రామ ప్రజలు కాపాడాలని కోరుతున్నారు.
TAGGED:
Anantapuram District news