YCP Leaders Occupying SC and ST Lands: 'వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం.. నిధులు, భూములు మాయం' - Rajya Sabha Member Kanakamedala
YCP Leaders Occupying SC and ST Lands: వైసీపీ సర్కార్ రాష్ట్రంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో ఆరోపించారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, అధికార పార్టీ నాయకులు ఎస్సీ, ఎస్టీల భూముల్ని కాజేస్తున్నారని ఆయన రాజ్యసభ దృష్టికి తెచ్చారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద కేంద్రం కేటాయించిన మొత్తం నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దారి మళ్లిసోందని తెలిపారు. తాజాగా ఎస్టీ భూములపై చట్ట సవరణ తెచ్చి.. భూములను అధికార పార్టీ నేతలకు కట్టబెట్టేందుకు సహకరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, రాత్రి, పగలు తేడా లేకుండా ఎస్సీ మహిళలపై అత్యాచారాలు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను దుర్వినియోగం చేస్తున్నారని వెల్లడించారు. వారి ప్రయోజనాలను కేంద్రం పరిరక్షించాలని కోరారు. రవీంద్రకుమార్ ఆరోపణలపై స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి... వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధికి అనేక పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కానుక పేరుతో 12 లక్షల మంది ఎస్సీ, ఎస్టీలకు రూ. 2600కోట్లు అందజేసినట్లు వివరించారు.