Ventures in DKT lands: డీకేటీ భూముల్లో వెంచర్లు.. వైసీపీ నేతల కొత్త వ్యాపారం! - ఈటీవీ ఈనాడు నిఘా
Ventures in DKT lands: వైసీపీ నాయకులు కొత్త ఎత్తులతో స్థిరాస్తి వ్యాపారంలోకి అడుగు పెట్టారు. డీకేటీ భూముల్లో వెంచర్లు వేసి ప్లాట్లుగా మలచి విక్రయాలకు సిద్ధమయ్యారు. ఈ తతంగం తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం శివనాథపాలెం సమీపంలో వెలుగు చూసింది. శ్రీకాళహస్తీశ్వరాలయం తరఫున దేవుడు బాట ఏర్పాటయ్యాక శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలంలోని గ్రామీణ ప్రాంతాలలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీనికితోడు శ్రీకాళహస్తిలోని పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లు పెద్ద ఎత్తున పట్టణానికి శివారులో ఉన్నాయి. ఇదే అదనుగా భావించిన కొందరు వైసీపీ నేతలు టిడ్కో ఇళ్లకు సమీపంలో తొట్టంబేడు మండలం శివనాథపాలెం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 149/1,2లో 6.67 ఎకరాల డీకేటీ స్థలంపై కన్నేశారు. ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం రూ. ఐదు కోట్లకు పైగా పలుకుతుండగా ఈ స్థలాన్ని అనుభవిస్తున్న వాళ్లతో చేతులు కలిపి డీకేటీ భూముల్లో ఎంచక్కా ప్లాట్లు వేశారు. టిడ్కో ఇళ్ల మధ్య ఏర్పాటు చేసిన అంతర్గత రోడ్ల నుంచి ప్లాట్లకు రోడ్లు కలిసే విధంగా మార్కింగ్ వేసి జేసీబీతో పనులు వేగవంతం చేశారు. దీన్ని గుర్తించిన ఈటీవీ -ఈనాడు సంఘనా స్థలానికి వెళ్లి వార్త సేకరించడంతో తొట్టంబేడు తహసీల్దార్ సుధీర్ రెడ్డి స్పందించారు. వైసీపీ నేతలు ప్లాట్ల కోసం రాళ్లు వేసిన స్థలానికి వెళ్లి వాటిని తొలగించారు. మళ్లీ ఇలాంటి చర్యలకు చేపట్టే చర్యలు తీసుకుంటామని తెలియజేయడం గమనార్హం. ప్రభుత్వం పంపిణీ చేసిన డీకేటీ భూములను లబ్ధిదారులు అనుభవించే అవకాశం మాత్రమే ఉంటుంది. క్రయవిక్రయాలు నిషేధమైనప్పటికీ రాజకీయ బలం, అధికారుల అండదండలతో యథేచ్ఛగా ప్లాట్లు వేసి విక్రయాలు జరుపుతుండటం గమనార్హం.