YCP Leaders Attack on TDP Workers: పల్నాడులో రెచ్చిపోతున్న వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తల కుటుంబంపై మరోసారి దాడి.. - పల్నాడు జిల్లా లేటెస్ట్ న్యూస్
YCP Leaders Attack on TDP Workers: ఎద్దులు తమ పాకలోకి వచ్చాయనే విషయంలో చోటు చేసుకున్న వివాదం.. చినికి చినికి గాలి వానలా మారి దాడులకు దారితీసింది. వైసీపీకు చెందిన వ్యక్తులు తాము ఏమి చేసినా చెల్లుతుందనే ధీమాతో దాడులకు తెగబడుతున్న పరిస్థితి నెలకొంది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం బోదలవీడులో టీడీపీ సానుభూతిపరుడు మామిళ్లపల్లి కోటయ్య, మందలపు లక్ష్మీ, మామిళ్లపల్లి శిరీషపై గ్రామ వైసీపీ నేత నంబూరి కృష్ణ మూర్తి, భూషయ్య, శ్రీను రాడ్లు, కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని, మూడు రోజులుగా తమ కుటుంబంపై వైసీపీ నేతలు ఇలా దాడులకు తెగబడుతున్నారని బాధితులు వాపోయారు. ఈ ఘటనలో గాయపడ్డ బాధితులను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, మూడురోజులుగా తమపై దాడులు జరుగుతున్నా కేసు నమోదు చేయలేదని బాధితుల మండిపడుతున్నారు. తమకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని కోరారు. బాధితులను టీడీపీ నాయకులు పరామర్శించారు.