YCP Leaders Attack on TDP Sympathizer: టీడీపీ సానుభూతిపరుడిపై వైసీపీ నేతలు దాడి.. కారు ధ్వంసం - Attack on TDP sympathizer in Rentalla
YCP Leaders Attack on TDP Sympathizer: తెలుగుదేశం సానుభూతిపరునిపై వైసీపీ నేతలు దాడి చేసి గాయపరిచిన ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని రెంటచింతల మండలం రెంటళ్ల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు సర్వారెడ్డి సోదరుడు శనివారం మృతి చెందడంతో.. టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి వచ్చి నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ నేపథ్యంలో బ్రహ్మారెడ్డి రాకను వైసీపీ నేతలు తట్టుకోలేక కొందరు వ్యక్తులు సర్వారెడ్డి కారుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. ఈ దాడిలో సర్వారెడ్డికి గాయాలు అయ్యాయి. సర్వారెడ్డిని చికిత్స కోసం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా.. మార్గం మధ్యలో మళ్లీ వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. సర్వారెడ్డిని రెంటచింతల పోలీసు స్టేషన్‌కు బలవంతంగా తీసుకెళ్లి కేసు పెట్టేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో రెంటచింతలలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్వారెడ్డిపై దాడిని తెలుగుదేశం ఇంచార్జి బ్రహ్మారెడ్డి ఖండించారు.