YCP Leaders Attack on TDP Leaders in Srikakulam: వైసీపీ నేతల భూ కబ్జా.. అడ్డుకున్న టీడీపీ నేతలపై దాడి - రణస్థలం మండలం రావాడ
YCP Leaders Attack on TDP Leaders in Srikakulam: రాష్ట్రంలో వైసీపీ నేతల అక్రమాలు, భూ కబ్జాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. కొండలు, గుట్టలు, ప్రభుత్వ స్థలాలు వేటినీ వదలడం లేదు. ప్రశ్నించిన వారిపై దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేతలు భూకబ్జాను అడ్డుకున్న టీడీపీ నేతలపై దాడులు చేశారు. జిల్లాలోని రణస్థలం మండలం రావాడ రోడ్డులో.. ప్రభుత్వ స్థలం ఆక్రమణను అడ్డుకున్న తెలుగుదేశం నాయకులపై వైసీపీ నేతలు దాడి చేశారు. సీఐ కార్యాలయం వెనుక భాగంలోని 18 సెంట్ల స్థలంపై.. తెలుగుదేశం నేత ఆనందరావు, వైసీపీ నాయకుడు పిన్నింటి సత్యంనాయుడు కుటుంబాల మధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. ఐతే.. అది ప్రభుత్వ స్థలమే అని, గ్రామ పంచాయతీకి చెందిన భూమి అని.. రెవెన్యూ అధికారులు కోర్టులో కౌంటర్ వేశారు. వివాదం కొనసాగుతుండగానే వైసీపీ నాయకులు ఆక్రమణకు దిగారు. స్థలంలోని సామగ్రిని యంత్రాలతో తొలగించారు. ఇదేంటని ప్రశ్నించిన టీడీపీ నాయకులపై దాడి చేశారు.