మహిళా ఎస్ఐపై దాడి ఘటనలో ఎమ్మెల్యే రాచమల్లు హస్తం : ప్రవీణ్ కుమార్ రెడ్డి - టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 10, 2023, 5:47 PM IST
Allegations against MLA Rachamallu Siva Prasad Reddy:వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఒకటో పట్టణ పోలీసుస్టేషన్ మహిళా ఎస్ఐ హైమవతిపై, వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అనుచరులే రాళ్లతో దాడి చేశారంటూ టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దాడిలో ఎమ్మెల్యే రాచమల్లు హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే, పోలీసులు నిందితులను పట్టుకోవడం లేదని ఆరోపించారు. గత కొంత కాలంగా వైసీపీ నేతలు, పెన్నానది నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
ఇసుక తరలిస్తున్న వారిని పట్టుకునేందుకు వెళ్లిన మహిళా ఎస్ఐ హైమావతిపై దాడి చేయడం బాధాకరమన్నారు. పోలీసుల పైనే దాడులు జరుగుతుంటే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రొద్దుటూరులో రాచమల్లు ప్రసాద్ రెడ్డి బెదిరింపులకు పోలీసులు బయపడే పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాటి మహిళా ఎస్ఐపై దాడి చేస్తే, పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యేకు సంబంధించిన వ్యక్తులే దాడి చేశారని, వైసీపీ ప్రభుత్వంలో మహిళా ఎస్ఐకి న్యాయం జరగదని తెలిపారు.