YCP Class War: వైసీపీలో తారాస్థాయికి వర్గపోరు.. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసనలు - Sectarian differences in YCP
YCP Class war in Srikakulam district: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండల కేంద్రంలో స్థానిక స్థానిక వైసీపీలో వర్గ వివాదాలు తారాస్థాయికి చేరాయి. పాతపట్నం ఎమ్మెల్యేగా రెడ్డి శాంతి తమకు వద్దంటూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. కొత్తూరు మండల కేంద్రంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు ఎల్ తులసీ వరప్రసాద్ నేతృత్వంలో వైసీపీలోని కొంతమంది కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. పార్టీని ప్రాణ సమానంగా చూస్తూ, జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని పని చేసిన వైసీపీ నాయకులు, కార్యకర్తలపై ఎమ్మెల్యే రెడ్డిశాంతి పోలీసులకు తప్పుడు ఫిర్యాదులు చేయడాన్ని ఖండిస్తూ, ఎమ్మెల్యేగా ఆమె వద్దంటూ నినాదాలు చేశారు. కొత్తూరులోని తులసీ వరప్రసాద్ ఇంటి నుంచి పురవీధుల్లో తిరుగుతూ ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నాలుగురోడ్ల కూడలి వరకూ ప్రదర్శనగా వెళ్లారు.
ఈ సందర్భంగా ఎంపీపీ సావిత్రి, ఉప ఎంపీపీ తులసీ వరప్రసాద్, హిరమండలం, కొత్తూరు మండల ప్రత్యేక ఆహ్వానితులు మాట్లాడుతూ వైసీపీ బలోపేతానికి కృషి చేస్తున్న రేగేటి కన్నయ్యస్వామి, ఇసాయి ప్రశాంత్‌కుమార్, సీపాన విక్రమ్‌లపై తప్పుడు కేసులు బనాయించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. భవిష్యత్తులో రెడ్డి శాంతికి టికెట్ ఇస్తే తామంతా వ్యతిరేకంగా పని చేసి ఓడిస్తామన్నారు. ఈ వ్యవహారాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు.