పోలీసుల ద్వారా బెదిరిస్తున్నారని సొంత ఎమ్మెల్యేపై ఎస్పీకి వైసీపీ నేత ఫిర్యాదు - పొన్నూరు ఎమ్మెల్యేపై ఆరోపణలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 6, 2023, 4:57 PM IST
YCP Leader Complaint on MLA Kilari Rosaiah: పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య పోలీసుల ద్వారా బెదిరిస్తున్నారని.. తక్కెళ్లపాడు వైసీపీ నేత సుఖమంచి రోజారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పని చేస్తే గంజాయి కేసులు పెడతామని, రౌడీషీట్ తెరుస్తామని పెదకాకాని సీఐ సురేష్ బెదిరిస్తున్నట్లు చెప్పారు. దీనిపై గుంటూరు జిల్లా ఎస్పీకి వైసీపీ నేత సుఖమంచి రోజారావు ఫిర్యాదు చేశారు. తాను వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్నానని పెదకాకాని మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన రోజారావు తెలిపారు.
ఎమ్మెల్యే కిలారి రోశయ్య పనితీరు నచ్చక.. గత రెండేళ్లుగా ఆయనకు దూరంగా ఉంటున్నానని.. ఈ నేపథ్యంలో సీఐ సురేష్ బాబు స్టేషన్కు పిలిపించి.. బలవంతంగా ఫోన్ తీసుకున్నారని ఆరోపించారు. ఫోన్లోని వ్యకిగత సమాచారం, కాల్ రికార్డులు కాపీ చేసుకున్న సీఐ.. గంజాయి, రౌడీ షీటర్ కేసు నమోదు చేస్తానని బెదిరించారని వైసీపీ నేత రోజారావు పేర్కొన్నారు. ఖాళీ కాగితం మీద సంతకాలు పెట్టించుకుని భయపెడుతున్నారని, నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోశయ్యకు వ్యతిరేకంగా ఉన్న 250 మంది వైసీపీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టారని రోజారావు ఆరోపించారు.