వైసీపీ నేత చంపేస్తానని బెదిరిస్తున్నాడు - నన్ను రక్షించండి : సెల్ఫీ వీడియోలో సామాన్యుడి ఆందోళన - కొమ్మారెడ్డి చలమారెడ్డి వార్నింగ్ ఆడియో
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 30, 2023, 12:48 PM IST
YCP Leader Chalama Reddy Warning to TDP Activist: వైసీపీ నేత కొమ్మారెడ్డి చలమారెడ్డి తనను చంపుతానంటూ బెదిరిస్తున్నాడని.. పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన తెలుగుదేశం కార్యకర్త చల్ల రాజారత్నం సెల్ఫీ వీడియోలో ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ వీడి వైసీపీలో చేరిన చలమారెడ్డికి వ్యతిరేకంగా.. సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టానని.. బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు వాపోయారు.
చలమారెడ్డి తనకు ఫోన్ చేసి.. నోటికొచ్చినట్టు దూషిస్తున్నారని సెల్ఫీ వీడియోలో బాధితుడు తెలిపారు. తన కుటుంబ సభ్యులను అసభ్యంగా దూషించారని, కించపరుస్తూ మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు.. కొమ్మారెడ్డి చలమారెడ్డి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, అతని తమ్ముడు వెంకట రామిరెడ్డి వలన ప్రాణహాని ఉందని చల్లా రాజారత్నం సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. తనకు రక్షణ కల్పించాలంటూ పోలీసులు వేడుకుంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అదే విధంగా ఒక ఆడియో సైతం విడుదల చేశారు. అందులో బాధితుడితో అత్యంత అసభ్యంగా ఓ వ్యక్తి మాట్లాడుతున్నారు. దీనిపై తనను రక్షించాలంటూ బాధితుడు రాజారత్నం ఆవేదన వ్యక్తం చేశారు.