రైతుపై వైసీపీ నేత దాడి - బాధ్యులను శిక్షించాలని డీజీపీకి చంద్రబాబు లేఖ - Obstructing The Road Construction Works
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 25, 2023, 11:02 PM IST
YCP Leader Attacked Farmer For Obstructing The Road Construction Works:చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలం వెంకటాపురానికి చెందిన రైతు కుటుంబంపై అధికార వైసీపీ మండల స్థాయి ప్రజాప్రతినిధి దాడి చేయడంతో బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రైతు భూమిలో రోడ్దు వేసేందుకు కొందరు స్థానికుల నుంచి సదరు అధికార పార్టీ ప్రజాప్రతినిధి రూ. 3 లక్షలు తీసుకుని దౌర్జన్యంగా రోడ్దు వేసేందుకు ప్రయత్నించినట్లు బాధిత రైతు కుటుంబం సభ్యులు తెలిపారు. రోడ్డు నిర్మాణం పనుల్ని అడ్డుకున్నందుకు తమపై సదరు నాయకుడు అతని అనుచరులతో కలిసి దాడి చేశారని రైతు వాపోయారు.
కోర్టులో ఉన్న భూమిలో రోడ్డు వేసేందుకు వైసీపీ నేత యత్నిస్తున్నారని బాధితులు ఆవేదన చెందారు. తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. అధికార పార్టీ నేత దాడిలో గాయపడిన బాధితులకు న్యాయం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. బాధ్యులను చట్టపరంగా శిక్షించాలని కోరుతూ చంద్రబాబు రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు.