Ycp Incharge Flex In Guntur Mpdo Office : వైసీపీ లీడర్ కావడమే అర్హతా..? ప్రభుత్వ కార్యక్రమాల్లో ఫొటోపై ప్రశ్నించిన టీడీపీ సభ్యులు - ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 11, 2023, 12:34 PM IST
|Updated : Oct 11, 2023, 1:05 PM IST
Ycp Incharge Flex In Guntur Mpdo Office :గుంటూరు జిల్లా తాడికొండ ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం జరిగిన మండల ప్రజాపరిషత్ అధికారిక సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేత ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం విమర్శలకు తావిచ్చింది. ఈ సమావేశంలో ప్రస్తుతం తాడికొండ వైసీపీ ఇంఛార్జ్‌గా కొనసాగుతున్న కత్తెర సురేశ్ ఫొటోను అధికారులు ఫ్లెక్సీగా ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన ఎంపీడీవో అధికారిక సమావేశాలలో తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి ఫ్లెక్సీ ఉండేది. అయితే శ్రీదేవిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు.
ప్రస్తుతం తాడికొండ వైసీపీ ఇంఛార్జ్‌గా కొనసాగుతున్న కత్తెర సురేశ్ ఫోటో ఫ్లెక్సీని, ఎమ్మెల్యే శ్రీదేవి ఫొటో స్థానంలో అధికారులు ఏర్పాటు చేశారు. దీనిపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. కత్తెర సురేశ్ ప్రజాప్రతినిధి కాకపోయినా, ప్రభుత్వ కార్యాలయంలో, అధికారిక సమావేశంలో ఆయన ఫొటో ఎలా పెడతారని ఎంపీడీవోను టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఎంపీడీవో సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కత్తెర సురేశ్ పాల్గొంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.