దివ్యాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: జేఏసీ నాయకులు - వైసీపీ ప్రభుత్వం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 8, 2024, 9:01 PM IST
YCP Government Neglecting Disabled Problems: విభిన్న ప్రతిభావంతులైనా దివ్యాంగులపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని విభిన్న ప్రతిభావంతుల జేఏసీ నాయకులు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నెలకు 3000 రూపాయలు విభిన్న ప్రతిభావంతులకు పింఛనిస్తూ మిగిలిన సంక్షేమ పథకాలను రద్దు చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టుకతోనైనా లేక విధివంచితమైన కారణాలేమైనా గానీ సమాజంలో దివ్యాంగులకు ప్రత్యేక చేయూత అవసరమని పేర్కొన్నారు. అటువంటి దివ్యాంగులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్వయం ఉపాధి కల్పనతో పాటు సంక్షేమ పథకాల్లోనూ ఇతర వర్గాల కంటే మిన్నగా దివ్యాంగులకు ఆర్థిక భరోసా ప్రభుత్వం కల్పించాలని జేఏసీ నాయకులు కోరారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వంపై పోరాడేందుకు నూతనంగా జేఏసీ కమిటీని ఏర్పాటు చేసినట్లు నేతలు తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీన దివ్యాంగుల సమస్యల పరిష్కార సాధనకై జాతీయ రహదారిపై దిగ్బంధం చేస్తున్నట్లు ప్రకటించారు. అదే విధంగా ఫిబ్రవరి నెలలో దివ్యాంగుల మహా గర్జన సభ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించి దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని జేఏసీ నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.