YCP Factionalism Spread to Villages: గ్రామాలకూ పాకిన ఫ్యాక్షనిజం.. స్థానిక సమస్యల్లోనూ టీడీపీ కార్యకర్తలపై వైసీపీ ముఠాల దాడి - టీడీపీ నేతలు
YCP Factionalism Spread to Villages: వైసీపీ మార్కు ఫ్యాక్షనిజం గ్రామాలకూ పాకింది. అడ్డొస్తే దంచుడే..! అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇరుగు పొరుగు వివాదాల్లో, కుటుంబ తగాదాల్లో, స్థానిక సమస్యల్లోనూ ఫ్యాక్షన్ ముఠాలు దాడులకు తెగబడుతున్నాయి. వారం రోజుల కిందట.. పల్నాడు జిల్లాలో ఓ ఎద్దు తమ పాకలోకి రావడంపై ప్రశ్నించిన టీడీపీ కార్యకర్త కుటుంబంపై వైసీపీ నేత దాడికి పాల్పడ్డాడు. తల్లికి అడ్డుగా వచ్చిన కూతురును చితకబాదడంతో.. ఆ బాలిక ఆస్పత్రి పాలైంది. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేయడంలో తాత్సారం చేయగా.. మరోసారి దాడి జరిగింది. తాజాగా శ్రీ సత్య సాయి జిల్లా (Sri SatyaSai District) గోరంట్ల మండలం వెంకటరమణ పల్లి గ్రామంలో ఎరువు దిబ్బకు సంబంధించిన స్థల వివాదంలో వైసీపీ నేత టీడీపీ వారిపీ దాడికి పాల్పడ్డాడు. పక్క గ్రామాల నుంచి రెండు కార్లలో రౌడీలను పిలిపించి మరీ టీడీపీ కార్యకర్తలను చితకబాదారు. ఈ ఘర్షణలో టీడీపీ కార్యకర్తలు సోమశేఖర్గం, గులప్ప, రామచంద్ర, ఆదిమూర్తి, ఆదిలక్ష్మిమ్మ, రత్నమ్మ తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను గోరంట్ల వైద్యశాలకు తరలించారు.