Yarlagadda Venkata Rao Joined TDP: లోకేశ్ సమక్షంలో సైకిల్ ఎక్కిన యార్లగడ్డ.. రేపు గన్నవరంలో భారీ సభ - కృష్ణా జిల్లా లేటెస్ట్ న్యూస్
Yarlagadda Venkata Rao Joined TDP: గన్నవరం వైసీపీ నేత, కృష్ణా జిల్లా డీసీసీబీ మాజీ ఛైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు.. తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేశ్ సమక్షంలో.. పసుపు కండువా కప్పుకున్నారు. యార్లగడ్డ వెంకట్రావును లోకేశ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత సమావేశమై పలు విషయాలు చర్చించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున గన్నవరం నుంచి పోటీ చేసిన వెంకట్రావు.. వల్లభనేని వంశీపై 838 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత వల్లభేనేని వంశీ వైసీపీలో చేరడాన్ని జీర్ణించుకోలేకపోయారు. డీసీసీబీ పదవి ఇచ్చినా కొన్నాళ్లకే తొలగించడంతో.. పొమ్మనకుండా పొగబెట్టారని భావించారు. ఈ పరిస్థితుల్లోనే ఇటీవల అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం హైదరాబాద్లో చంద్రబాబును కలిసిన యార్లగడ్డ.. తెలుగుదేశంలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు సోమవారం లోకేశ్ సమక్షంలో సైకిల్ ఎక్కారు. లోకేశ్ యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం గన్నవరంలో తెలుగుదేశం భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది. 2 లక్షల మందితో సభను విజయవంతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ సమయంలో యార్లగడ్డ చేరిక మరింత ఊపు తెస్తుందని తెలుగుదేశం భావిస్తోంది.