Womens Protest For Water: ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన.. ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణ - Womens Protest
Womens Agitation For Safe Driking Water: తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తూర్పు గోదావరి జిల్లాలో మహిళలు అందోళనకు దిగారు. కలుషిత మంచినీరు సరఫరా చేస్తున్నారని.. వాటిని తాగితే అనారోగ్యానికి గురవుతున్నామని వారు వాపోయారు. దేవరపల్లి మండలం కొండగూడెంలో రెండు నెలలుగా కలుషిత మంచినీరు సరఫరా చేస్తున్నారని.. కొండగూడెం మహిళలు గౌరీపట్నం పంచాయతీ కార్యాలయం వద్ద అందోళనకు దిగారు. ఖాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. రెండు నెలలుగా మంచినీరు సరఫరా కావటం లేదని.. తమకు పంపిణీ అయిన నీటిని తాగితే అనారోగ్యాల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నీటితో స్నానం చేస్తే చిన్న పిల్లలకు దురదలాంటి సమస్యలు తలెత్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాడైపోయిన బోరు స్థానంలో నూతన బోరు ఏర్పాటు చేయించి సురక్షిత నీటిని అందిస్తామని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు హామీ ఇచ్చారని మహిళలు అన్నారు. అధికారులను దీనిపై ప్రశ్నిస్తే మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ.. నిర్లక్ష్యపు సమాధానాలు ఇస్తున్నారని ఆరోపించారు.