Women Protest in Atmakur: ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు.. పది రోజులైనా నీరందడం లేదని నిరసన - ఆత్మకూరు తాజా వార్తలు
Women Protest in Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో తాగునీరు రావడం లేదని మహిళలు ఆందోళనకు దిగారు. గత పది రోజుల నుంచి తాగునీరు రాకపోవడంతో మహిళలు ఖాళీ బిందెలు పట్టుకొని రోడ్డు మీదకు వచ్చి వారి నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారని.. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న తాగునీటి పైపులైన్లు ధ్వంసమయ్యాయని స్థానికులు తెలిపారు. దీంతో అప్పటి నుంచి తాగునీరు రాక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని వారు పేర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు సంబంధిత శాఖాధికారులకు ఫిర్యాదు చేశామని స్థానికులు తెలిపారు. ఫిర్యాదు చేసినప్పటికి మున్సిపల్ అధికారులు తాగునీటి పైపులైన్ల మరమ్మతుకు చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సంబంధిత శాఖాధికారులు వెంటనే స్పందించి వారి ప్రాంతంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు డిమాండ్ చేశారు.