తాగునీరు సరఫరా చేయాలంటూ ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన మహిళలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 5, 2024, 5:24 PM IST
Women Protest for driinking waterఅనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో తాగునీరు సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఖాళీ బిందెలతో స్థానిక మహిళలు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. దాదాపు 20 రోజుల నుంచి తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధులకు హాజరవుతున్న ఉద్యోగులను మున్సిపల్ కార్యాలయం గేటు వద్ద అడ్డుకుని తమ గోడును వెలబోసుకున్నారు. తమకు వెంటనే తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. తాగునీరు సరఫరా చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా 14వ వార్డు ప్రజలు నినాదాలు చేశారు. ప్రభుత్వం తమకు తాగునీరు సరఫరా చేసి దాహార్తి తీర్చాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు. తాగునీరు, వీధి దీపాలు, పారిశుద్ధం వంటి అత్యవసర పనులు ఎక్కడికక్కడ పూర్తి కాకుండా ఆగిపోవడంతో రాయదుర్గం పట్టణ ప్రజల పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని పేర్కొన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి మరో రెండు రోజుల్లో మీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.