Woman Volunteer Attack: ఇంటి కాగితాలు తీసుకురాలేదని.. దంపతులపై మహిళా వాలంటీర్ దాడి
Woman Volunteer Attack on Couple : పింఛను సంతకాల కోసమని తన తల్లిదండ్రుల్ని ఇంటికి పిలిచిన ఓ మహిళా వాలంటీర్ కర్రతో వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిందని కుమారుడు అంబటి రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం ఐనంపూడిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పింఛను కాగితాలపై సంతకాలు చేసేందుకు వాలంటీర్ డెక్కా మురళి.. అంబటి పద్మ, ఆమె భర్త నాంచారయ్యని ఇంటికి పిలిచింది. గతంలో ఉన్న ఇంటి స్థలం వివాదానికి సంబంధించిన కాగితాలు తీసుకురాలేదంటూ వాలంటీర్ మురళి వారితో ఘర్షణకు దిగి కర్రతో దాడి చేసింది. పక్కనే ఉన్న వాలంటీర్ భర్త డెక్కా బుచ్చిబాబు, మరిది సుబ్రహ్మణ్యం, అత్త ఏడుకొండలు మూకుమ్మడిగా గొడ్డలి, కర్రలతో వారిపై విచక్షణరహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారని,.. అనంతరం తన తల్లి మెడలోని బంగారు గొలుసు దోపిడీ చేశారని అంబటి రాజు ఆరోపించారు. విషయం తెలుసుకొని వెంటనే వచ్చి తన తల్లిదండ్రులను ఉయ్యూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించానని, ఎక్కువ రక్తస్రావం అవుతున్నందున వైద్యుల సిఫారసు మేరకు విజయవాడ తీసుకెళ్తున్నట్లు అంబటి రాజు చెప్పారు. దీనిపై తమకు ఫోను ద్వారా సమాచారం వచ్చిందని ఏఎస్‌ఐ ఆనందరావు తెలిపారు.