Woman Murder ఏడు నెలల క్రితం జరిగిన వృద్ధ మహిళ హత్యను ఛేదించిన పోలీసులు - కడప డీఎస్పీ షరీఫ్
Woman Murder: ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళను టార్గెట్ చేశారు ఇద్దరు యువకులు. అనంతరం ఆమె కదలికలపై రెక్కీ నిర్వహించి ఒక సమయం చూసి చివరకి ఆ మహిళను అంతం చేశారు. ఈ ఘటన వైయస్సార్ కడప జిల్లా పెండ్లిమర్రి మండలంలోని ఎగువపల్లెలో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..!
కడప డీఎస్పీ షరీఫ్ తెలిపిన కథనం ప్రకారం.. వైయస్సార్ కడప జిల్లా కమలాపురం మండలానికి చెందిన వీర నాగరాజు, పెండ్లిమర్రికి చెందిన రవీంద్రలు మామిడి వనంలో పనిచేసేవారు. వీరు అప్పుడప్పుడు పనిమీద పెండ్లిమర్రి మండలం ఎగువపల్లెకు వెళ్లే వారు. ఈ క్రమంలో ఎగువపల్లెకు చెందిన దాదిరెడ్డి ఓబులమ్మ అనే 82 సంవత్సరాల వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉంటుందని గ్రహించారు. ఆమె ఒంటిమీద ఉన్న బంగారం కన్నేసిన వీరు.. ఆమె కదలికలపై రెక్కీ నిర్వహించారు. పథకం ప్రకారం గతేడాది నవంబర్ 17వ తేదిన చుట్టు పక్కలా ఎవరూ లేని సమయం చూసి.. ఓబులమ్మ ఇంట్లోకి చొరబడి ఆమె గొంతు నిలిపి హత్య చేశారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, కమ్మలు, చేతికి గాజులు దొంగలించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో వీర నాగరాజు, రవీంద్రల కదలికలపై అనుమానం వచ్చింది. తమకోసం గాలిస్తున్నారని తెలిసుకున్న దుండగులు.. వారే వీఆర్వో వద్ద కు వచ్చి లొంగిపోయారు. తమ తప్పును ఒప్పుకున్నారు. అనంతరం వారిద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి నాలుగు బంగారు గాజులను స్వాధీన పరుచుకున్నట్లు డీఎస్పీ చెప్పారు.