Woman Died IVF Operation Fail in Anantapur : 'సంతాన చికిత్స పేరుతో ఊపిరి తీశారు..' ఠాగూర్ సినిమా సీన్ రిపీట్! - మహిళ చనిపోయినా బ్రతికే ఉందంటూ ట్రీట్‌మెంట్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 23, 2023, 7:33 PM IST
|Updated : Aug 23, 2023, 9:04 PM IST
Woman Died IVF Operation Fail in Anantapur : సంతానం కోసం సాఫల్య చికిత్సను అశ్రయించిన మహిళ.. వైద్యం వికటించి మృతి చెందింది. దీంతో ఆగ్రహానికి గురైన బంధువులు ఆస్పత్రిపై దాడి చేశారు. అనంతపురంలో జరిగిన ఈ సంఘటన వివరాలు మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా జొహరాపురం గ్రామానికి చెందిన మోదీన్‌బీ (32)కి అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పీసీ ప్యాపిలికి చెందిన సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ వన్నూరు స్వామితో ఏడేళ్ల కిందట వివాహమైంది. మృతురాలి భర్త ప్రస్తుతం దిల్లీలో విధులు నిర్వహిస్తున్నాడు. సంతానం కలగకపోవడంతో అనంతపురంలోని ఓ ప్రైవేటు గైనకాలజిస్టును సంప్రదించారు. ఐవీఎఫ్ ద్వారా సంతానం కలిగేలా చికిత్స చేస్తానని చెప్పడంతో 3 నెలలుగా చికిత్స పొందుతున్నారు.
పల్స్ ఉందని నమ్మించారు :సర్జరీ కోసమని మోదీన్‌బీని ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లగా.. మోదీన్‌బీ మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. తమకు విషయం చెప్పకుండా గంట పాటు (Tagore Movie Scene) ఐసీయూలోనే ఉంచారని ఉంచారని, ఆ తర్వాత లోపలికి పిలిచి మూర్ఛ వచ్చిందని, సీరియస్‌గా ఉంది.. బెంగళూరుకు తీసుకెళ్లాలని సూచించారని తెలిపారు. 'ఆక్సిజన్ పంపింగ్ చేస్తూ పల్స్ ఉన్నట్లు నమ్మించడానికి ప్రయత్నించారు.. ఇలా నాలుగు గంటల పాటు ఏ విషయం చెప్పకుండా ఆపరేషన్ థియేటర్‌లోనే నాటకం ఆడారు.. పోలీసులకు సమాచారం ఇచ్చి, పోలీసులు రాగానే వైద్యులు మోదీన్‌బీ చనిపోయినట్లు ప్రకటించారు' అని మోదీన్ బీ బంధువులు తెలిపారు.
ఆసుపత్రిపై దాడి : మృతురాలు గుత్తి మున్సిపల్ ఛైర్‌పర్సన్ వన్నూరమ్మ మేన కోడలు కావడంతో పెద్ద ఎత్తున బంధువులు ఆసుపత్రికి తరలి వచ్చారు. కోపోద్రిక్తులైన వారు ఆసుపత్రిలోని ఐసీయూ గదిని ధ్వంసం చేశారు. అద్దాలను పగుల గొట్టారు. ఈ ఘటనలో మృతురాలి మామ షఫీ చేతికి తీవ్రగాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న అనస్థీషియా వైద్యుడిపై దాడికి యత్నించారు. దాడిని ముందుగానే పసి గట్టిన వైద్యురాలు లోపలే ఉండిపోయారు. నగర సీఐలు రెడ్డెప్ప, శివరాముడు, ప్రతాప్‌రెడ్డి ఎస్సైలు సిబ్బందితో ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళనను శాంతింపజేశారు. ఆరోగ్యంగా ఉన్న తమ కూతురిని ఇంజక్షన్ వేసి చంపేశారని తల్లి అసాన్‌బీ రోదించారు. యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రిని సీజ్ చేయాలని బాధితురాలి కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.