Wife Protest Infront of Husband House: ప్రేమించి పెళ్లి చేసుకుని.. ఏడాదిన్నర తర్వాత వదిలేశాడు.. న్యాయం కోసం భార్య పోరాటం - భార్యాభర్తల గొడవలు
Wife Protest Infront Of Husband House :ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వదిలేయటంపై.. మహిళా సంఘాల సహాయంతో ఓ మహిళ అత్తారింటి ముందు నిరసనకు దిగింది. ఏడాదిన్నరపాటు సంసార జీవనం సాగించి ముఖం చాటేసిన భర్తను కలిసేందుకు గోదావరి జిల్లాలో అడుగుపెట్టిన ఆమె.. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని చెబుతోంది. ఈ సంఘటన డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది.
ముమ్మిడివరం ఐ.పోలవరం మండలం తిల్లకుప్ప గ్రామంలో భర్త ఇంటిముందు ఎస్. సంధ్య నిరసనకు దిగింది. ఆమె సొంతూరు హైదరాబాద్. ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్నాళ్లు కాపురం చేసి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చాడంటూ భర్త యాళ్ల శ్రీనివాస్ ఇంటి ముందు భైఠాయించింది. తన వెంట వచ్చిన మహిళా సంఘం ప్రతినిధులతో కలిసి నిరసనకు దిగింది. భాగ్యనగరంలో కన్సల్టెన్సీగా పని చేసుకుంటున్న తనను సాఫ్ట్వేర్ ఉద్యోగిగా శ్రీనివాస్ పరిచయం చేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని.. ఏడాదిన్నర తర్వాత తనను వదిలేసి వెళ్లిపోయాడని తెలిపింది. అక్కడే ఉంటున్న భర్త కుటుంబ సభ్యులకు శ్రీనివాస్ కోసం అడిగినా, తనకు ఏవిధమైన సమాధానం చెప్పలేదని.. చివరికి మహిళా సంఘాలను ఆశ్రయించి వారి సహకారంతో భర్త ఇంటికి చేరుకున్నట్లు వివరించింది. అయితే భర్త కుటుంబ సభ్యులు తన రాకను గమనించి ఇంటికి తాళాలు వేసుకుని తప్పించుకున్నారన్న ఆమె.. తనకు న్యాయం జరిగే వరకూ ఇక్కడే ఉంటానని వెల్లడించింది. సంధ్యకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని ఆమె వెంట వచ్చిన సీసీఐడీ ట్రస్ట్ జాతీయ ఛైర్‌పర్సన్ డా. శివపావని ఇతర మహిళలు పేర్కొన్నారు.