Government Hostel Problems: శిథిలావస్థకు హాస్టళ్లు.. ప్రాణభయంతో విద్యార్థులు - ap latest news
Welfare Hostel Students Facing Problems : పేద విద్యార్థులు ఉన్నత జీవితాల కోసం సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో వారి పట్ల ప్రభుత్వం, అధికారులు చిన్న చూపు చూస్తున్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు వసతులు కల్పనలో కింది స్థాయి అధికారుల నుంచి పైస్థాయి అధికారుల వరకూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారి భోజనం, బాగోగులు, ఆరోగ్యం గురించి ఎవ్వరూ పట్టించుకునే నాథుడే లేడు. కనీసం తాగునీరు, మరుగుదొడ్లు సమస్యలను తీర్చకుండా చేతులెత్తేస్తున్నారు. అనంతపురంలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లు విద్యార్థుల పాలిట యమపాశాలుగా మారాయి.
అనంతపురం జిల్లా ఉరవకొండ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఉరవకొండ నియోజవర్గంలో మొత్తం 16 బీసీ, ఎస్సీ వసతి గృహాలు ఉన్నాయి. దాదాపు 1276 మంది విద్యార్థులు వసతి సౌకర్యం పొందుతున్నారు. పెచ్చులూడిన పైకప్పుల కింద బిక్కుబిక్కుమంటూ.. ప్రాణాలను అరచేతిలో పెడ్డుకోని గడుపుతున్నారు. కడ్డీలు తేలిన పైకప్పు నుంచి చిన్న వర్షానికే గదులన్నీ కారుతున్నాయని.. గదులన్నీ జలమయమవుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల హాస్టల్ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మల, మూత్ర విసర్జనకు బహిరంగ ప్రదేశాలకు వెళ్తున్నామని విద్యార్థులు అంటున్నారు.
టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు భరత్ మాట్లాడుతూ ఉరవకొండ నియోజకవర్గంలోని ఎస్సీ,బీసీ సంక్షేమ వసతి గృహాలలో మౌళిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వసతి గృహాల వార్డెన్లు స్థానికంగా ఉండాలన్నారు. మరుగుదొడ్లు లేక విద్యార్థులు రోడ్డు దాటి వెళ్లాల్సి వస్తోందని వాపోయారు. తాగడానికి తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వసతి గృహాలలో మౌళిక సదుపాయాలు కల్పించాలని భరత్ డిమాండ్ చేశారు.