Wedding party vehicle Accident : వివాహ వేడుకలో విషాదం.. కొండ దిగుతుండగా... అదుపుతప్పిన వాహనం - Medikonduru mandal latest news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 9, 2023, 12:25 PM IST
Wedding party vehicle Accident : వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. కొండ దిగుతున్న క్రమంలో వాహనం అదుపు తప్పి బండరాయిని ఢీకొట్టిన సంఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలోని పేరిచర్ల వద్ద జరిగింది. ఈ ఘటనలో 13 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన కొంత మంది.. కూలి పనుల నిమిత్తం గుంటూరు వలస వచ్చారు. గుంటూరు చుట్టుకుంట ప్రాంతంలో నివాసం ఉంటూ మిర్చి యార్డులో పని చేస్తున్నారు. వారిలో రెస్స, గౌతమ్లకు పెళ్లి నిశ్చయం అయింది.
పేరిచర్ల శివారులో గల శివాలయంలో వారికి వివాహం జరిగింది. బంధువులంతా సంతోషంగా వేడుక పూర్తి చేసి.. ఆటోలో కొండ దిగుతుండగా.. అదుపుతప్పి పక్కనే ఉన్న బండరాయిని ఢీకొట్టి ఆగింది. వాహనంలో మొత్తం 15 మంది ఉండగా ఆటో వెనుక భాగంలో ఉన్న 12 మందితో పాటు డ్రైవర్ కు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో వధూవరులకు ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం గుంటూరు సర్వజనాసుపత్రి తరలించారు.