Water Problem in GTW Ashram School: జీటీడబ్ల్యూ ఆశ్రమ పాఠశాలలో దాహం కేకలు.. అల్లాడుతున్న విద్యార్థినులు - అల్లూరి జిల్లా లేటెస్ట్ న్యూస్
Water Problem in GTW Ashram School: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో గత వారం రోజుల నుంచి నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. దీనిపై అధికారుల నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. గత వారం రోజులు నుంచి కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా నీళ్లు దొరకట్లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో మోటారు పాడైపోవడంతో విద్యార్థులు ఇలా నీటి కష్టాలతో సతమతమవుతున్నారు. దీంతోపాటు భూగర్భజలాలు అడుగంటిపోవడం కూడా మంచినీటి సమస్య ఎదుర్కొనడానికి ఒక కారణమని తెలిసింది. ఈ విషయంపై స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు నేరుగా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, జలవనరుల శాఖ అధికారులకు చెప్పినప్పటికీ స్పందించలేదని స్టూడెంట్స్ వాపోయారు. బాలికలు కావడంతో కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయటకు వెళ్లలేక సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థినుల కష్టాలు తెలుసుకున్న జడ్పీటీసీ సభ్యుడు బాలయ్య, చింతపల్లి సర్పంచి పుష్పలత పంచాయతీ ట్రాక్టర్ ద్వారా పాఠశాలకు నీటి సరఫరా చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి చింతపల్లి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలిక ఆశ్రమ పాఠశాలలో నెలకొన్న నీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని జడ్పీటీసీ సబ్యుడు బాలయ్య, సర్పంచి పుష్ఫలత, విద్యార్థినులు కోరుతున్నారు.