Waqf Board Special Officer Case : వక్ఫ్‌బోర్డు ప్రత్యేక అధికారి నియామకం రద్దు.. గెజిట్ రద్దు చేసిన హైకోర్టు - హైకోర్టు తీర్పు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 25, 2023, 10:09 AM IST
Waqf Board Special Officer Case : వక్ఫ్ బోర్డుకు ప్రత్యేక అధికారిగా షిరీన్‌బేగంను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 15న జారీచేసిన గెజిట్ ప్రకటనను హైకోర్టు రద్దు చేసింది. ప్రత్యేక అధికారిని నియమించే అధికారం ప్రభుత్వానికి లేదని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఏపీ వక్ఫ్‌బోర్డుకు ప్రత్యేక అధికారి నియామకంపై ఇచ్చిన గెజిట్ ప్రకటనను సవాలు చేస్తూ నెల్లూరు జిల్లా ఏఎస్‌పేటలోని ఓ దర్గాకు చెందిన ముతవల్లీ హఫీజ్ పాషా హైకోర్టులో రెండు వ్యాజ్యాలు వేశారు. తనను సస్పెండ్ చేస్తూ ప్రత్యేక అధికారి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని అభ్యర్థించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. ప్రత్యేక అధికారిని నియమించే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వ్యాజ్యాలకు విచారణ అర్హత లేదన్నారు. వక్ఫ్‌బోర్డు కాలపరిమితి ఈ ఏడాది మార్చి 12తో ముగిసిందని గుర్తు చేసిన న్యాయమూర్తి.. ప్రత్యేక అధికారి నియామకమే చట్టవిరుద్ధమైనప్పుడు.. ముతవల్లీని సస్పెండ్ చేస్తూ ఆ అధికారి ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవని స్పష్టం చేశారు.