VRO Caught by ACB Officials: రైతుల వద్ద లంచం తీసుకుంటూ.. ఏసీబీకి పట్టుబడ్డ వీఆర్వో
VRO Caught by ACB Officials : ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మండలంలోని కపిల లాడ్జి కూడలిలో యేరువారిపల్లి గ్రామ వీఆర్వో వేణుగోపాల్ రెడ్డి.. ఇద్దరు రైతుల వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఏరువారిపల్లి గ్రామానికి చెందిన వీరంరెడ్డి లక్ష్మీరెడ్డి, రామిరెడ్డి అనే ఇద్దరు రైతులకు చెందిన 5 ఎకరాల 72 సెంట్లు వ్యవసాయ భూమికి సంబంధించిన పొలం పాసు పుస్తకాల కోసం వీఆర్వోను సంప్రదించగా ఇద్దరు కలిసి రూ. లక్ష రూపాయలు ఇస్తేనే పాసు పుస్తకాలు ఇస్తానని డిమాండ్ చేశాడు. మొదటిగా రూ. 21,000 చెల్లించి పాస్ పుస్తకాలు వచ్చిన తరువాత మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని చెప్పాడు. దీంతో రైతులు ఏసీబీ అధికారులను సంప్రదించారు. వెంటనే స్పందించిన ఏసీబీ అధికారులు తమదైన పద్ధతిలో వలపన్ని.. రైతుల వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. ఆ సమయంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద స్థానిక ప్రజలు భారీ ఎత్తున గుమిగూడారు. వీరిని చెదరగొట్టేందుకు భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి.. ప్రజలను వెళ్లగొట్టారు.