వైసీపీ నాయకుల పట్ల స్వామి భక్తి చాటుకున్న వాలంటీర్లు - స్వాగతం పలుకుతూ బ్యానర్లు - volunteers Atrocities in AP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 12, 2024, 2:24 PM IST
Volunteers Put Banners Welcoming YCP Leaders: శ్రీ సత్య సాయి జిల్లాలో గ్రామ వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలుగా మారిపోయారు. మంత్రి పర్యటన సందర్భంగా స్వాగత బ్యానర్లు కడుతూ స్వామి భక్తిని చాటుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy Ramachandra Reddy) చిలమత్తూరు మండలంలో పార్టీ బలోపేతం కోసం పంచాయతీ కేంద్రాలలో సభలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దేమకేతేపల్లిలో గ్రామ వాలంటీర్లు మంత్రి పెద్దిరెడ్డికి, నాయకులకు స్వాగతం పలుకుతూ బ్యానర్లు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇలా రాజకీయ నాయకులకు స్వాగతం పలికే వాలంటీర్లు రాబోయే ఎన్నికలలో వైసీపీకి అనుకూలంగా పనిచేస్తారనేందుకు ఈ స్వాగత బ్యానర్లు నిదర్శనంగా మారాయి. అలానే నాయకుల మీటింగ్లకు జనాలను తరలించడంలో వాలంటీర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఎక్కడ సభ జరిగినా వీరే ముందు ఉండి అన్నీ చూసుకోవలసిన భాద్యత తీసుకుంటున్నారు. వాలంటీర్లు గ్రామంలో ఏర్పాటు చేసిన స్వాగతం బ్యానర్లను చూసిన గ్రామస్థులు వీళ్లు వాలంటీర్లా లేక కార్యకర్తలా అని బహిరంగంగా చర్చించుకుంటున్నారు.