Volunteer Suicide Attempt: మహిళా వాలంటీర్‌కు వేధింపులు..ఆత్మహత్యాయత్నం - మహిళా వాలంటీర్‌కు వేధింపులు
Volunteer Suicide Attempt: కృష్ణా జిల్లా గుడివాడలో మహిళా వాలంటీర్ ఆత్మహత్యకు యత్నించారు. విధులు సరిగా నిర్వహించట్లేదని.. తోటి వాలంటీర్ నాగేంద్ర, సచివాలయ ఎడ్యుకేషన్ కార్యదర్శి దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటర్ల సర్వే తన పరిధి కాదని.. ఆ పని చేయనని చెప్పినందుకు.. సచివాలయం వద్ద దుర్భాషలాడుతూ కొట్టడానికి వచ్చారనే మనస్తాపంతో.. చంద్రలీల ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి యత్నించారు. ఇరుగుపొరుగువారు చంద్రలీలను కాపాడి గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లి చికిత్స పొందుతుండగా పిల్లలు తీవ్ర ఆందోళనకు గురికావడం అక్కడున్నవారిని కలిచివేసింది.
గుడివాడ పట్టణంలోని 26వ వార్డు వాలంటీరు ప్రత్తిపాటి చంద్రలీల కొంత కాలంగా భర్తకు దూరంగా ఉంటూ వాలంటీర్‌గా పని చేస్తున్నారు. తన ఇద్దరు పిల్లలను పోషించుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం సరిపోవడం లేదని ఓ జిరాక్స్ షాప్‌లో పనిలో చేరారు. అక్కడ వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ క్రమంలో చంద్రలీల సరిగా విధులు నిర్వహించలేదని తోటి వాలంటీరు నాగేంద్ర, సచివాలయంలోని పంచాయతీ కార్యదర్శి బేబి దుర్గ దుష్ప్రచారం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి గుడివాడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.