Volunteer Escape with Pension Money: నెల్లూరు జిల్లాలో వాలంటీర్ల నిర్వాకం.. లబ్ధిదారుల సొమ్ము కాజేత - Volunteer
Village Volunteer Jumps with Pension Money: నెల్లూరు జిల్లాలోని ఒకే ఊరిలో ఇద్దరు వాలంటీర్లు చేతివాటం ప్రదర్శించి లబ్ధిదారుల సొమ్ము కాజేశారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నాగినేనిగుంటలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. అవ్వాతాతలకు ఇవ్వాల్సిన పింఛన్ డబ్బులతో ఉడాయించాడు వాలంటీర్ నల్లిపోగు ఖాదర్‌బాబు. 19 మందికి పెన్షన్ ఇచ్చేందుకు ఈ నెల 2న.. వెల్ఫేర్ అసిస్టెంట్ నుంచి 57 వేల రూపాయలు తీసుకున్న ఖాదర్‌బాబు... ఆ డబ్బుతో ఉడాయించాడు. నాలుగు రోజులుగా పింఛన్ ఇవ్వకపోవడంతో విషయం తెలుసుకున్న అధికారులు... గ్రామంలోని వృద్ధుల వద్దకు వెళ్లి నగదు ఇవ్వకుండానే వేలిముద్రలు వేయించుకున్నారు. తర్వాత... వాలంటీర్ తల్లిదండ్రుల నుంచి ఆ సొమ్మును వసూలు చేసి.. లబ్ధిదారులకు అందజేశారు. కానీ... పింఛన్ సొమ్మును కాజేసిన వాలంటీర్‌పై ఎలాంటి ఫిర్యాదు చేయకుండా... గుట్టుచప్పుడుకాకుండా విధుల నుంచి తొలగించారు. ఇదే గ్రామానికి చెందిన మరో వాలంటీర్ ఖాసిం పీర ఎకంగా... ఓ లబ్ధిదారురాలి బ్యాంకు ఖాతా నుంచి అమ్మఒడి డబ్బునే కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బ్యాంక్ మొబైల్ యాప్‌తో హుస్సేనమ్మ అనే మహిళ వేలిముద్ర తీసుకున్న ఖాసిం పీర... ఖాతా నుంచి అమ్మఒడి డబ్బు కొట్టేశాడు. బ్యాంకులో డబ్బులు లేకపోవడంతో వాలంటీర్‌ను హుస్సేనమ్మ నిలదీశారు. డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని బాధితురాలు ఆరోపించారు. గతంలోనూ ఇలా కొంతమంది గ్రామ వార్డు వాలంటీర్లు ఫెన్షన్ నగదుతో ఉడాయించిన ఘటనలు చాలానే జరిగాయి.