Viveka Murder Case Updates: వివేకా హత్య కేసులో భాస్కరరెడ్డి, ఉదయ్ కీలక పాత్ర.. బెయిల్ మంజూరు చేయొద్దన్న సీబీఐ - Vivekananda Reddy murder case
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 25, 2023, 7:49 AM IST
Viveka Murder Case Updates: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతోపాటు, సాక్ష్యాలు ధ్వంసం చేయడంలోనూ వైఎస్ భాస్కరరెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సీబీఐ తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. హత్య కేసులో సీబీఐ కోర్టు బెయిలును తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి.. దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. నిందితులు పలుకుబడి ఉన్నవారు కావడంతో సాక్షులను ప్రభావితం చేయగలరని.. బెయిలు మంజూరు చేయొద్దని సీబీఐ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. గతంలో దర్యాప్తునకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని, ఇప్పుడు బెయిలిస్తే విచారణను సాఫీగా సాగనివ్వరని తెలిపింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును వాయిదా వేశారు. మరోవైపు హత్య కేసులో దర్యాప్తు పూర్తయి అభియోగపత్రం దాఖలు చేసిన నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని నిందితుడు శివశంకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేసి.. తీర్పును ఈ నెల 29కి వాయిదా వేసింది.