ఆకట్టుకున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 స్టాల్స్
VISAKHAPATNAM GLOBAL INVESTORS SUMMIT 2023 STALLS PRESENTATION : విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన సుమారు నూటయాబై కి పైగా స్టాళ్లను ప్రదర్శనకు ఉంచారు. ఏపీకి చెందిన 30 స్టాళ్లతోపాటు ప్రభుత్వం గుర్తించిన 13 కీలక రంగాలకు చెందిన స్టాళ్లను తీర్చిదిద్దారు. ముఖ్యంగా రక్షణ రంగానికి చెందిన హిందూస్తాన్ ఏరో నాటికల్, భారత్ డైనమిక్ లిమిటెడ్, ఇండియన్ ఇమ్మూన్షన్, ఒడిశా హస్త కళలు, ఏపీఐఐసీతో పలు సంస్థలు స్టాళ్లతో కొలువుదీరాయి.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ మొదటి రోజు ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌లో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. పారిశ్రామిక, ప్రభుత్వ వాణిజ్య సంస్థలు ఏపీ పెవిలియన్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం జగన్, కేంద్రమంత్రి గడ్కరీ ప్రారంభించారు. వివిధ పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, మహిళా సంఘాలు, హస్త కళాకారులు ఉత్పత్తులను ఈ స్టాల్స్‌లో ప్రదర్శించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వివిధ రకాల స్టాల్స్‌ను సందర్శించి, వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మన రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ప్రభుత్వం తలపెట్టిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో మొదటిరోజు దాదాపు పదకొండున్నర లక్షల రూపాయిల ఒప్పందాలు జరిగాయి. శనివారం మరో లక్షన్నర కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు జరగనున్నాయి. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉందని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. పరిశ్రమల స్థాపనకు వచ్చే వారికి ఏ అవసరం ఒచ్చినా ఒక్క ఫోన్‌కాల్ దూరంలో ఉంటానని అన్నారు. భారతదేశం అభివృద్ధి ప్రయాణంలో ఏపీది కీలక పాత్ర అని వివరించారు. శనివారంతో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ముగియనుంది.