Booming poisonous fevers : విజృంభిస్తున్న విష జ్వరాలు - FEVERS
Viral Fever Spread in Andra : విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆండ్ర గ్రామంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. విష జ్వరాల వ్యాప్తితో గ్రామస్థులు అల్లాడిపోతున్నారు. ప్రజలు త్రీవ ఇబ్బందులకు గురవుతున్నారు. వారం రోజుల వ్యవధిలో వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. గ్రామానికి చెందిన మరికొంత మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్రామానికి చెందిన కళ్యాణపు రవణ విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మజ్జి పోలేస్ విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు. గ్రామంలో మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ జ్వరాలు వ్యాప్తి అధికంగా ఉందని గ్రామస్థులు వాపోతున్నారు. వైద్యులు ఇచ్చిన మందులు సరిగా పని చేయడం లేదని, గ్రామంలో పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు వాంతులు, విరేచనాలతో బాధ పడుతున్నారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని, పారిశుధ్య పనులు చేపట్టాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యశాఖ అధికారులు, గ్రామ వాలంటీర్లు కనీస చర్యలు తీసుకోవడంలేదని ప్రజలు త్రీవ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.