Sand Smuggling at Swarnamukhi River: అక్రమ ఇసుక రవాణా.. అడ్డుకున్న గ్రామస్థులు - ap latest news
Sand Smuggling at Swarnamukhi River: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నాగయ్యగారిపల్లెలో ఉద్రిక్తత నెలకొంది. ఇసుక రీచ్‌కు చెందిన గుత్తేదారులు అనుమతులు లేకుండా పట్టా భూములల్లోకి ప్రవేశిస్తున్నారని గ్రామస్థులు మండిపడ్డారు. జేసీబీలను అడ్డుకుని ఆందోళనకు దిగారు. బుధవారం ఉదయం నుంచి స్వర్ణముఖి వాగులో ఇసుక తరలించడానికి దారిని సిద్ధం చేసుకున్న యువకులను గ్రామస్ధులు అడ్డుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్థులకు ఇసుక గుత్తేదారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నకిలీ బిల్లులు ఉన్న బ్యాగును గ్రామస్థులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు ముందస్తు సమాచారం లేకుండా మా భూముల్లోకి ఎలా ప్రవేశిస్తారని వారు ప్రశ్నించారు.
స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తమ్ముడు రఘునాథరెడ్డి ఇసుక దందా నిర్వహిస్తున్నాడని అందుకే అధికారులు వారికి వత్తాసు పలుకుతున్నారని గ్రామస్థులు ఆరోపించారు. అక్కడ ఉన్న ట్రాక్టర్లు, టిప్పర్లు జేసీబీలు సీజ్ చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇసుక తరలించడానికి వచ్చిన యువకులకు వత్తాసు పలకడంతో గ్రామస్థులు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
పోలీసులు మాట్లాడుతూ.. మాపై అధికారులు వీరికి సహాయం చేయమన్నారని తెలపడంతో ఆగ్రహించిన ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుకను తరలించడానికి ఒప్పుకోమని ఎదురు తిరిగారు. దీనితో చేసేదేమీ లేక ఇసుక తరలించడానికి వచ్చిన వారు వాహనాలతో సహా అక్కడ నుంచి వెళ్లిపోయారు. విచారించి గ్రామస్థులకు తగిన న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. తహశీల్దార్ శిరీషను వివరణ అడగగా.. నాగయ్యగారిపల్లెలోని స్వర్ణముఖి వాగులో ఎవ్వరికీ ఇసుక రీచ్ కోసం అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.