అధికార పార్టీ సర్పంచ్‌కు కోపం వచ్చింది - ఆమె నిరసనకు ఊరు కదలి వచ్చింది ! కారణం ఏంటో తెలుసా ? - ల్నాడు జిల్లా దాచేపల్లి మండలం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 5, 2023, 9:27 PM IST
|Updated : Nov 5, 2023, 9:59 PM IST
Villagers Staged Protest: ఆ ప్రాంతంలో రోడ్ల సమస్యలను పరిష్కరించాలంటూ.. అధికార పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ ధర్నాకు దిగారు. ఊరు బాగుకోసం పాటుపడే సర్పంచే నిరసనకు దిగడంతో.. ఆ ఊరు ప్రజలు కూడా చేయి కలిపారు. ఇంకే ముంది.. ఆ గ్రామంలో భారీగా ప్రజలు పోగుకావడంతో.. రహదారిపై రాకపోకలకు ఆంతరాయం ఏర్పడింది. పాడైపోయిన రోడ్లను రిపేరు చేయించలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వానికి.. కనీసం ఉన్న రోడ్లనైనా కాపాడలంటూ వారు నినాదాలు చేశారు. గ్రామంలోని రోడ్ల దుస్థితికి కారణమవుతున్న భారీ వాహనాల రాకపోకలను నియంత్రించాలని పట్టుబట్టారు. ఈ రోడ్లపై ప్రయాణాలతో ఒళ్లు గుల్ల అవుతోందని, అస్తవ్యస్తమై రోడ్లను పునర్ నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వ పనితీరుకు నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తున్న ఈ ఘటన.. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తెంగెడ గ్రామంలో చోటు చేసుకుంది.
సర్పంచ్, గ్రామస్థులు చెప్పిన వివరాల ప్రకారం.. తమ గ్రామం నుంచి వాహనాల రాకపోకలు పెరిగాయిని.. తద్వారా భారీ వాహనాల రాకపోకల వల్ల గ్రామంలోని రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి తమ సమస్యలు చెప్పుకున్నా సరిగా స్పందించలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల నుంచి వచ్చే వాహనాలతో రోడ్లపై భారీ గుంతలు ఏర్పడ్డాయని వెల్లడించారు. ప్రభుత్వాధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే తమ ఆందోళన ఉద్ధృతం చేస్తామని గ్రామస్థులు హెచ్చరించారు.