Villagers Questioned YCP MLA Kiran Kumar: నాలుగేళ్లలో ఏం చేశారు.. ఎమ్మెల్యే కిరణ్ కుమార్ను అడ్డుకున్న గ్రామస్థులు - ఎచ్చర్ల తాజా వార్తలు
Villagers Questioned Echerla YCP Mla: ఎచ్చర్ల నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్కు తీవ్ర నిరసన సెగ తగిలింది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు అయినా తమ గ్రామంలో ఏ సమస్యలు పరిష్కరించలేదని గొర్లె కిరణ్ కుమార్ను గ్రామస్థులు నిలదీశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కిరణ్ ఎచ్చెర్ల మండలం తోటపాలెం గ్రామంలో పర్యటించారు. తమ గ్రామంలోకి ఎమ్మెల్యే వచ్చాడన్న విషయం తెలుసుకున్న స్థానికులు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా తమ గ్రామంలో రహదారులు, కాలువలు తదితర సమస్యలు ఏవీ పరిష్కారం కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తోటపాలెం గ్రామంలో ఏడాదిగా ఎలాంటి ఉపాధి పనులను వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించలేదని గ్రామస్థులు వాపోయారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడిన ఎమ్మెల్యే కిరణ్ కుమార్.. గ్రామ సమస్యల గురించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశానని పేర్కొన్నారు. గ్రామస్థులు తమ సమస్యలపై ఎమ్మెల్యేను నిలదీస్తున్న సమయంలో పలువురు యువకులు వీడియోలు తీయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.