Public fire on MLA: మాకు ఇళ్లు, స్థలాలు ఏవీ..? ఎమ్మెల్యేను అడ్డుకున్న గ్రామస్థులు - ఇళ్ల నిర్మాణం
Public fire on MLA: కాకినాడ జిల్లా ఈ కొత్తపల్లి మండలం నాగులపల్లి గ్రామంలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పెండిం దొరబాబును ఇళ్ల స్థలాల లబ్ధిదారులు నిలదీశారు. గత వారంలో జరిగిన ఇదే సమావేశంలో ఇళ్ల స్థలాల సమస్యలు పరిష్కరించాలని అధికారులను నిర్బంధించగా.. ఈరోజు ఏకంగా ఎమ్మెల్యేను చుట్టుముట్టారు. సమావేశంలో సర్పంచి గౌరీ రాజేశ్వరి ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని తమను ప్రజలు నిలదీస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, ఎమ్మెల్యే దొరబాబు ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణాలు పూర్తి చేసిన తర్వాత మళ్లీ గ్రామంలోకి ఓట్లు అడగడానికి వస్తానని సమావేశంలో తెలిపారు. సభ ముగించే ప్రయత్నం చేయడంతో సర్పంచ్ గౌరీ రాజేశ్వరి భర్త, వైసీపీ నేత వడిశెట్టి నారాయణరెడ్డి మాట్లాడే ప్రయత్నం చేయగా.. ఎమ్మెల్యే వెళ్లిపోవడానికి సిద్ధపడ్డారు. పది నిమిషాలు ఉండి తమ సమస్య వినాలని సర్పంచ్ భర్త కోరినప్పటికీ ఎమ్మెల్యే దొరబాబు వినకుండా వెళ్లిపోయే ప్రయత్నం చేయగా గ్రామస్థులు చుట్టుముట్టారు. మహిళా సర్పంచ్ రాజేశ్వరి.. ఎమ్మెల్యేను అడ్డగించారు. పోలీసుల సహకారంతో ఎమ్మెల్యే దొరబాబు వెళ్లిపోయే ప్రయత్నం చేయగా కారును అడ్డగించారు. వాహనాన్ని కూడా వెంబడించి.. 'మళ్లీ గ్రామంలోకి నువ్వు ఎలా వస్తావో మేమూ చూస్తాం' అని హెచ్చరించారు.