Dumping Yard Problem: "సారూ.. శ్మశానవాటిక పక్కన డంపింగ్ యార్డ్ తొలగించండి" - యానాంలో గ్రామస్థుల నిరసన
Villagers Protest at Deputy Collector Office: కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాంలో జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న నాలుగు గ్రామాలకు చెందిన శ్మశాన వాటికను ఆనుకొని నిర్వహిస్తున్న చేపల అమ్మకాలను.. రోడ్డు పక్కనే ఉన్న డంపింగ్ యార్డును తక్షణమే తొలగించాలంటూ గ్రామస్థులు డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. మత్స్యకారులు చేపలు, మాంసం విక్రయాల అనంతరం ముస్లింలు మిగిలిన చెత్తనంతా శ్మశాన వాటికలో వేస్తున్నారని.. దీనివల్ల బంధువులను ఖననం చేసేటప్పుడు దుర్వాసనతో ఒక్క నిమిషం కూడా నిలవలేకపోతున్నామన్నారు. అదేవిధంగా ఊరికి దగ్గరలో యానాం పట్టణానికి సంబంధించి సేకరించిన చెత్తంతా అక్కడే డంపింగ్ చేస్తున్నారని.. గత కొన్నేళ్లుగా ఇది కొండలను తలపించేలా పేరుకుపోయిందని.. ఆ రోడ్లో వెళ్లాలంటే ముక్కు మూసుకోక తప్పదని వాపోతున్నారు. ఈ విషయంపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ఈ క్రమంలో వందలాది మంది కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్ మునిస్వామికి, స్థానిక శాసన సభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్‌కు వినతి పత్రం అందించారు. తొందర్లోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని నిరసనదారులకు హామీ ఇచ్చారు.