Parents Lock to School: 250 మంది విద్యార్థులు.. ఒకే టీచర్.. తల్లిదండ్రుల ఆగ్రహం
One Teacher for 250 Students in Nitravatti : రాష్ట్రంలో 'నాడు-నేడు' కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చామని, ప్రతి విద్యార్థికి 'జగనన్న విద్యా కానుక' ద్వారా ప్రభుత్వం చదివిస్తోందని, ప్రతి పేద విద్యార్థి చదువు బాధ్యత తాను తీసుకుంటున్నానని సీఎం జగన్ సభలలో ఊదరగొడుతుంటారు. ఆయనకు మద్దతుగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కొత్త చరిత్ర వైపు అడుగులు వేస్తోందని వైఎస్సార్సీపీ నాయకులు చెబుతుంటారు. కానీ వాస్తవం దానికి భిన్నంగా ఉంది. ఓ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులను బదిలీ చేసిన ప్రభుత్వం.. వారి స్థానంలో మరొకరిని నియమించడం మరిచిపోయింది. ఈ విషయంపై గ్రామస్థుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
250 మంది విద్యార్థులు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కేవలం ఒకే ఒక్క ఉపాధ్యాయురాలు ఉండటంపై తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా హాలహర్వి మండలం నిట్రవట్టి ప్రాథమిక పాఠశాలలో 250 మంది విద్యార్థులు చదువుతున్నారు. గతంలో ఐదుగురు ఉపాధ్యాయులు ఉండేవారు. వీరిలో నలుగురిని ప్రభుత్వం బదిలీ చేసింది. కానీ వారి స్థానంలో వేరొకరిని నియమించడం ప్రభుత్వం మరిచింది. అందుకే ప్రస్తుతం ఒకే టీచర్ ఉన్నారు. ఆమె ఫొటోలు తీసి అప్లోడ్ చేసే పనిలో బిజీగా ఉన్నారని.. పిల్లలకు పాఠాలు చెప్పటం లేదని తల్లిదండ్రులు ఆరోపించారు. ఉపాధ్యాయులు కావాలని స్పందనలో ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పాఠశాలకు తాళం వేసి నిరసన తెలుపుతున్నామని, ఒకవేళ ప్రభుత్వం ఉపాధ్యాయలను నియమించకుంటే పాఠశాలను మూసే ఉంచుతామని విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరించారు.