Villagers Agitation Against Ex Mla: వెనుదిరిగిన మాజీ ఎమ్మెల్యే.. స్థానికుల ఆందోళన - వేల్పుమడుగులో ప్రజల ఆందోళన
Villagers Agitation Against Vishweshwar Reddy: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఉరవకొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కొన్ని ఇళ్లకు మాత్రమే వెళ్లి వెనుదిరగడం స్థానికంగా కలకలం రేపింది. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం వేల్పుమడుగు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉరవకొండ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు విశ్వేశ్వరరెడ్డి ఎస్సీ కాలనీలో పర్యటించారు. కేవలం కొన్ని ఇళ్లకు మాత్రమే వెళ్లిన ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మధ్యలోనే ముగించుకొని వెనుదిరిగారంటూ స్థానికులు వారి అవేదనను వ్యక్తం చేశారు. వారి ప్రాంతంలో ఇంటి పట్టాలు, డ్రైనేజీ, తాగునీటికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని.. వాటిని విశ్వేశ్వరరెడ్డి దృష్టికి తేవడానికి తాము ఆయన కోసం వేచి చూశామని స్థానికులు తెలిపారు. విశ్వేశ్వరరెడ్డి రాక కోసం వేచిచూస్తున్న వారికి ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మధ్యలోనే ముగించుకుని వెనుదిరిగారనే విషయం తెలియడంతో ఆ ప్రాంతంలో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది.