Two Thousand notes Distributed:పింఛన్‌దారులకు 2వేల నోట్ల పంపిణీ చేసిన వాలంటీర్.. సోషల్‌మీడియాలో వైరల్ - రెండు వేల రూపాయల నోట్లు రద్దు
Two Thousand Notes Distributed To Pensioners : రిజర్వ్ బ్యాంక్ ఉపసంహరించిన రెండు వేల రూపాయల నోట్లను సామాజిక పింఛన్లలో పంపిణీ చేయడం ప్రస్తుతం చర్చాంశనీయంగా మారింది. ఈ సంఘటన ఎక్కడో జరగలేదండీ.. మన రాష్ట్రంలోనే జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం ఆంబాకం పంచాయతీ పేరడం గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. గ్రామ వాలంటీర్ తన పరిధిలో లబ్దిదారులకు ఈ నెల 1న పింఛన్‌గా రెండు వేల రూపాయల నోట్లు పంపిణీ చేశారు. రెండు వేల రూపాయల నోట్లు బ్యాంకులో తప్ప ఎక్కడా చెల్లవని కుటుంబ సభ్యులు చెప్పడంతో వృద్ధులు చెల్లని నోట్లు ఎందుకు ఇచ్చారంటూ గ్రామ వాలంటీర్‌ను నిలదీశారు. బ్యాంకులో ఈ నోట్లే ఇచ్చారని, మీరు ఎక్కడైనా మార్చుకోవాల్సిందేనని వాలంటీర్ చెప్పడంతో ఫించన్ లబ్దిదారులు వీడియో తీయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వృద్దుల వీడియో వైరల్ కావడంతో గ్రామ వాలంటీర్ శుక్రవారం ఉదయం లబ్ధిదారులకు ఇచ్చిన రెండు వేల రూపాయల నోట్లను వెనక్కు తీసుకున్నారు. అనంతరం ఐదు వందల రూపాయల నోట్లను పంపిణీ చేశారు.