ఇరవై ఏళ్ల తర్వాత ఆ ఊళ్లో పెద్ద పండగ.. మన రాష్ట్రంలోనే! - Mamidipalli village deity Sri Mungaramma
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలో గ్రామ దేవత పండగ ఇరవై ఏళ్ల అనంతరం జరుగుతోంది. 2002 సంవత్సరంలో ఈ గ్రామ దేవత పండగ జరిగింది. మామిడిపల్లి గ్రామ దేవత శ్రీ ముంగారమ్మ తల్లి పండగకు.. ఆదివారం అంకురార్పణ అత్యంత వైభవంగా జరిగింది. అంకురార్పణ(గళ్ళు కలపడం) కార్యక్రమానికి.. గ్రామంలో ప్రజలందరూ కలిసికట్టుగా మహిళలు, యువకులు, పెద్దలు తరలివచ్చారు. ఈ పండగ ప్రారంభానికి ముందు ఆనవాయితీగా.. రాజుల వీధిలో రాజులచే అంకురార్పణ కార్యక్రమమైన గళ్ళు కలపడం మొట్టమొదట పూజ చేశారు.
ఈ కార్యక్రమం అనంతరం గ్రామ పొలిమేర వరకు ఊరేగింపుగా మహిళలు అందరూ ఒక వెదురు బుట్టలో మూలమాకు, నల్ల ఉలవలు, అన్నం, పసుపు కలిపి తలపై పెట్టుకుని వెళ్తారు. రాజులు పూజ చేసిన తర్వాత గ్రామ పొలిమేరలో దిష్టి తీసి దుష్ట శక్తులు గ్రామంలోకి రాకుండా చల్లుతారు. గ్రామదేవతలకు పూజ చేసి.. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దిష్టి తీసి బుట్టల్లో తెచ్చిన పదార్థాలను విసిరి వెళ్లిపోతారు. గళ్ళు కలిపే కార్యక్రమం గ్రామ దేవత పండగ సందర్భంగా పొలిమేర దాటి దుష్ట శక్తులు రాకుండా ఉండేందుకు చేసే పూజ అని గ్రామ పెద్దలు తెలిపారు. ఈ గళ్ళు కలిపే కార్యక్రమం మామిడిపల్లిలో ఇంటింటా ఆనందాన్ని నింపింది.