వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లక్ష్య సాధనలో ప్రజలే ప్రచారకర్తలు : నిర్మలా సీతారామన్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 10, 2023, 10:15 AM IST
Viksit Bharat Sankalp Yatra Started in Vijayawada:వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లక్ష్య సాధనలో ప్రజలే ప్రచారకర్తలని అర్హత ఉన్న ఏ ఒక్కరూ పథకం లబ్ధి పొందకుండా మిగిలిపోకూడదనే గొప్ప లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. విజయవాడ గ్రామీణ మండలం రాయనపాడులో ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ వాహనాన్ని పరిశీలించారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, పోషణ్ అభియాన్, ఉజ్వల 2.0, పీఎం ఆవాస్ యోజన తదితర స్టాళ్లను సందర్శించారు.
Nirmala Sitharaman Two Days Tour in AP : వివక్షకు తావులేకుండా సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ నినాదంతో 2047లోపు భారత్‌ను బాగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రధాని విశేష కృషి చేస్తున్నారని నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రతి పేదవాని అభివృద్ధికీ అన్ని సదుపాయాలూ అందించాలనే ఉద్దేశంతో వివిధ విధానాలు, పథకాలను ప్రభుత్వం ప్రారంభించిందనీ, ఒక పథకానికి 100 మంది లబ్ధిదారులుంటే 100 మందికీ ఆ పథకం చేరాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా మోదీ గ్యారెంటీ వ్యాన్ గ్రామ గ్రామానికీ వెళుతోందన్నారు. నవభారత నిర్మాణంలో అమృతకాలం విశిష్టత, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఔన్నత్యంపై ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా అందించిన సందేశాన్ని ప్రజలు తిలకించారు.