Mother and child died: 'అక్కడ సౌకర్యాలు లేవని ఇక్కడకు వస్తే.. నా భార్యను చంపేశారు' - Vijayawada old government hospital news
Mother and child died in Vijayawada Govt hospital: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రికి ప్రసవం కోసం వచ్చిన.. ఓ తల్లీబిడ్డ మృతి చెందారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు సరిగా లేవని తాజాగా విజయవాడలోని ప్రభుత్వ ఆసుత్రికి తేజస్విని అనే మహిళను బంధువులు తీసుకువచ్చారు. తేజస్వినికి పురిటి నొప్పులు రావడంతో వైద్యులు డెలివరీ కోసం ఆమెను ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లారు. డెలివరీలో తొలుత పసికందు చనిపోయిందని వైద్యులు తెలిపారు. మరికొద్దిసేపటికి తల్లి కూడా మరణించిదని చెప్పారు. దీంతో ఆవేదనతో ఆవేశానికి గురైన మృతురాలి (తేజస్విని) బంధువులు.. పసికందు మృతదేహంతో ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తల్లీబిడ్డ మరణించారని ఆరోపిస్తూ.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
'వైద్యుల నిర్లక్ష్యంతో నా భార్య మరణించింది'.. మృతురాలి భర్త మీడియాతో మాట్లాడుతూ..''మాది ఏలూరు జిల్లా. నా భార్య తేజస్విని డెలివరీ కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చాం. ఏలూరు నుంచి ఇక్కడికి తీసుకురావడానికే ఒక్కటే కారణం.. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాలు సరిగ్గా లేవు. నా భార్యకు పురిటి నొప్పులు రావడంతో.. డాక్టర్లు ఆసుపత్రి థియేటర్‌కు తీసుకెళ్లారు. దీంతో నేను ఆపరేషన్ థియేటర్ వద్ద పావుగంట ఉండి ఆ తర్వాత బయటికి వచ్చాను. తెల్లారి 2:13 మధ్యలో మీకు పాప పుట్టి చనిపోయిందన్నారు. దీంతో నేను.. మా ఆవిడ బాగుంటే చాలు అన్నాను. దానికి వాళ్లు మీ ఆవిడ చాలా బాగుంది అన్నారు. కొద్దీసేపు తర్వాత మీ ఆవిడ కూడా చనిపోయిందని చెప్పారు. ఏలూరులో సౌకర్యాలు లేవని ఇక్కడికి వస్తే.. అన్ని ఉండి కూడా నా భార్య చనిపోయింది. ముందే చెప్తే నేను ప్రైవేట్ ఆసుపత్రిలో చూయించుకునే వాడిని. వైద్యుల నిర్లక్ష్య కారణంగానే నా భార్య మరణించింది. దయచేసి అధికారులు, ప్రభుత్వం స్పందించి నాకు న్యాయం చేయండి'' అని వేడుకున్నారు.