Indira Gandhi Stadium: ఇందిరాగాంధీ స్టేడియంలో మహాయాగం.. ప్రభుత్వ తీరుపై క్రీడాకారుల అసహనం
Indira Gandhi Municipal Stadium: ప్రభుత్వం ఏ కార్యక్రమం నిర్వహించాలనుకున్నా అందుకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియమే దిక్కుగా మారింది. ఏడాది పొడవునా వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు స్టేడియం గ్రౌండ్‌ని ఆ కార్యక్రమానికి అనుగుణంగా చదును చేస్తున్నారు. ఆ కార్యక్రమం తర్వాత ఆ సామాగ్రిని తరలించడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. దీంతో కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతోదన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. నిత్యమూ క్రీడ స్థలాన్ని తవ్వడం, కంకర మట్టి వేయడంతో గ్రౌండ్ మొత్తం క్రీడలకు అనుకూలంగా ఉండటం లేదని క్రీడాకారులు ఆవేదన చెందుతున్నారు. దీంతోపాటు నగరంలో చిన్నపాటి వర్షం కురిసినా క్రీడా స్థలం నీట మునుగుతోంది.
వర్షం కారణంగా క్రీడా స్థలం బురదగా మారడంతో క్రీడాకారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతీ ఏడాది వేసవి సెలవుల సందర్భంగా ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో హాకీ, అథ్లెటిక్స్, ఫుట్ బాల్, వాలీబాల్ వంటి క్రీడలకు శిక్షణ ఇచ్చేవారు. ఈ ఏడాది ఏపీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చండీ రుద్రరాజ శ్యామల సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయాగాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. వేసవి క్రీడా శిక్షణా కేంద్రాన్ని శాప్ నిర్వహించకపోవడంతో క్రీడాకారులు నిరుత్సాహపడుతున్నారు.