Vidadala Rajini on Medical Colleges: కొత్త వైద్యకళాశాలల స్వయం ప్రతిపత్తి కోసమే మేనేజ్‌మెంట్ కోటా: విడదల రజిని
Vidadala Rajini Inspects Medical College Works: కొత్త వైద్యకళాశాలల స్వయం ప్రతిపత్తి కోసమే.. మేనేజ్‌మెంట్ కోటా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజని చెప్పారు. విజయనగరంలో కొత్తగా నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం పనులను మంత్రి విడదల రజని, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లాపరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, రాష్ట్ర వైద్య మౌలిక వసతుల సంస్థ ఎండీ మురళీధర్ రెడ్డి, వైద్య విద్య డైరక్టర్ నరసింహారావుతో కలసి పరిశీలించారు. భవనం నిర్మాణ పనులు జరుగుతున్న తీరు, పెండింగ్ పనులు, మౌలిక సదుపాయాలు, బోధన తరగతి, ప్రయోగశాలల గదులను పరిశీలించి అధికారుల ద్వారా వివరాలను తెలసుకున్నారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. విజయనగరం, రాజమండ్రి, మచిలీపట్నం, ఏలూరు, నంద్యాల నూతన మెడికల్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ ఐదు కళాశాలల ప్రారంభం ద్వారా రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 8,500 కోట్లతో 17 వైద్య కళాశాలల్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.. వీటిల్లో ఉత్తరాంధ్రలోనే విజయనగరంతో పాటు పాడేరు, నర్సీపట్నం, పార్వతీపురంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.