Gold Ring Theft : కంచెే చేను మేస్తే.. హుండీ లెక్కింపులో సూపరింటెండెంట్ చేతివాటం
Venkateswara Swamy Gold Ring Theft: దేవుడి కానుకలకు రక్షణగా నిలవాల్సిన ఓ అధికారి చేతివాటం ప్రదర్శించారు. స్వామి వారికి కానుకగా వచ్చిన ఓ బంగారు ఆభరణాన్ని తస్కరించింది. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలోని శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం చోటుచేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నిన్నటి వరకు స్వామి వారికి వచ్చిన కానుకల లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. సూపరింటెండెంట్ నిర్మలా రాణి, ఆలయ సిబ్బంది, వాలంటీర్లు కలసి హుండీని తెరిచారు. ఆరోజు గోల్డ్ అప్రైజర్ రానందున దేవుడికి వచ్చిన బంగారం, వెండి ఆభరణాలను పక్కన పెట్టారు. ఇదే అదనుగా భావించిన సూపరింటెండెంట్ నిర్మలా.. బంగారు ఆభరణాలను పక్కకు పెడుతున్నట్లు నటించి.. అందులో ఓ ఉంగరాన్ని చేతికి తొడుక్కున్నారు. దీనిని గమనించిన సిబ్బంది.. ఈవో తిమ్మానాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. విచారించిన ఆయన ఉంగరాన్ని దొంగలించినట్లు నిర్ధారించుకొని ఆమెను సస్పెండ్ చేశారు.
గతంలో కూడా చేతివాటం: నిర్మలారాణి గతంలో పెదకాకాని ఆలయంలో పనిచేసేది. కరోనా సమయంలో నగదు బీరువాలో పెడుతూ కొంత నగదును దొంగిలించింది. ఆ నగదును ఆలయ సిబ్బందికి అప్పుగా ఇవ్వటంతో అనుమానం వచ్చి సీసీ ఫుటేజ్ పరిశీలించగా దొంగతనం చేసినట్లు గుర్తించి అక్కడ నుంచి ఆమెను సస్పెండ్ చేశారు. అనంతరం వైకుంఠపురం ఆలయంలో సూపరింటెండెంట్‌గా విధుల్లోకి చేరారు. కాగా 53 లక్షల 97వేల 548 రూపాయలు కానుకల ద్వారా ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు.